మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు!

  • టెక్సాస్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురైనా బతికిన హంటర్ వైచ్
  • ఆసుపత్రిలో పది గంటల పాటు చికిత్స పొందిన హంటర్
  • 24 గంటల తర్వాత అదే ప్రాంతానికి వెళ్లిన హంటర్
టెక్సాస్ నది ఒడ్డున చేపలు పడుతుండగా పిడుగుపాటుకు గురైన 19 ఏళ్ల యువకుడు బతికి బయటపడ్డాడు. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హంటర్ వైచ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏంజెలీనా రివర్ దగ్గర చేపలు పడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

అతడు చేపలు పడుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను వచ్చింది. అప్పుడు హంటర్ వైచ్ ఒక పెద్ద చెట్టును ఆనుకుని నిలబడ్డాడు. పిడుగు ఎక్కువగా ఎత్తైన చెట్లపై పడతాయి. అతను ఆనుకుని ఉన్న చెట్టుపైనే పిడుగు పడింది. ఆ పిడుగు విద్యుత్ ధాటికి చెట్టు మొత్తం ముక్కలు చెక్కలైంది. చెట్టులోని ముక్కలు హంటర్ శరీరంలోకి వెళ్లాయి. పిడుగు యొక్క విద్యుత్ శక్తి కూడా అతడిని తాకింది.

సుమారు 30 వేల డిగ్రీల సెల్సియస్ వేడి ఒక్క క్షణంలో మనిషి నరాల వ్యవస్థను కాల్చివేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. చాలామందికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కానీ హంటర్ వైచ్ కనీసం స్పృహ తప్పిపడిపోలేదు. అయితే పిడుగుపాటు విద్యుత్ అతని కాళ్ళలోని నరాలను దెబ్బతీయడంతో కొంతసేపు కాళ్ళలో స్పర్ష లేకుండాపోయింది.

పిడుగుపాటు నుంచి బతికి బయటపడటం అరుదు. ఒకవేళ అలా బయటపడినా అలాంటి వారిని జీవితాంతం వివిధ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వినికిడి శక్తి పోవడం లేదా జ్ఞాపకశక్తి తగ్గడం లేదా నరాల వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. పిడుగుపాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది చనిపోతుంటారు. కానీ నేరుగా పిడుగుపాటుకు గురైన తర్వాత కూడా హంటర్ స్పృహలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత హంటర్ మరోసారి అదే ప్రదేశానికి వెళ్ళడం విశేషం.

పిడుగుపాటుకు గురై బయటపడిన కొందరిలో విచిత్రమైన మానసిక స్థితి కనిపిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము రెండోసారి జన్మించినట్లుగా భావిస్తారని తెలిపారు. పిడుగుపాటుకు గురైన హంటర్ హ్యోస్టన్‌లోని ఆసుపత్రిలో పది గంటల పాటు చికిత్స పొందాడు. ప్రపంచంలోనే తాను దురదృష్టవంతుడైన అదృష్టవంతుడినని హంటర్ చెబుతున్నాడు. తాను మరణానికి అంగుళాల దూరంలోకి వెళ్లివచ్చానని గుర్తు చేసుకుంటున్నాడు.

భారీ ఉరుములు వచ్చి పిడుగులు పడే సమయంలో పెద్ద పెద్ద చెట్ల దగ్గర లేదా వాటి కింద నిలబడవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చెట్టు మీద పిడుగు పడితే విద్యుత్ క్షణాల్లో నేలలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. అదే చెట్టు వద్ద మనం ఉంటే శరీరం కూడా విద్యుత్ వాహకంగా మారుతుందని చెబుతున్నారు. నీటి వద్ద ఉండటం కూడా ప్రమాదకరమే. నీటిలో కూడా విద్యుత్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది.

Hunter Wye
Texas lightning strike
lightning strike survivor
Angelina River
lightning safety
cardiac arrest

More Telugu News